శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు!
సంకల్పం మనిషిది కావచ్చు... కార్యసిద్ధి మాత్రం ఆ పరమశివుడి అనుగ్రహమే!
సంపూర్ణం...!
సాధన కుటీర్ ద్వారా సాగుతున్న సమాజహిత కార్యక్రమాలకు మరింత ఆధ్యాత్మిక శక్తిని అందించాలనే సంకల్పంతో, ముందుగానే ఎంపిక చేసుకున్న బిల్వ, వేప వృక్షాల సన్నిధిలో వెలసిన సదాశివుడికి సదాశివ క్షేత్రంగా నామకరణం చేసుకుని, పవిత్ర మహాశివరాత్రి నాడు కుటీర్‌లో కొలువుదీరాడు.
నిత్య అభిషేక పూజలను అందుకుంటూ, భక్తుల ఆరాధనను స్వీకరిస్తూ, పవిత్ర కార్తీక మాసంలో తన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించేందుకు తన స్థానాన్ని మరింత శక్తిమంతం చేసుకున్నాడు.
మహాశివరాత్రి నాడు కొలువుదీరిన సదాశివుడి సన్నిధిని సుందరీకరించాలనే సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పట్లో ఆ కార్యానికి అనుగ్రహం లభించలేదు. కాలం గడిచింది... కార్తీక మాసం వచ్చింది!
ఈసారి ఎలాంటి హడావుడి లేదు... ఆర్భాటం లేదు... కేవలం నిశ్శబ్ద భక్తి మాత్రమే!
కానీ, ఆ నిశ్శబ్ద భక్తికి స్పందించినట్టుగా సదాశివుడే తన కార్యసిద్ధికి కొందరిని నిమిత్తమాత్రులుగా ఎంచుకున్నాడు. తమ సంపదను, సమయాన్ని, శ్రమను స్వచ్ఛందంగా సమర్పించిన భక్తుల ద్వారా క్షేత్ర సుందరీకరణ కార్యం సంపూర్ణమైంది.
ఇది కేవలం ఒక నిర్మాణం పూర్తయిన సందర్భం కాదు... ఒక సంకల్పానికి శివానుగ్రహం తోడైన సందర్భం!
శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఎవరిని నిమిత్తంగా ఎంచుకుంటాడో, ఏ కార్యానికి ఎప్పుడు ముహూర్తం నిర్ణయిస్తాడో మన ఊహకు అందదు. మనం చేయగలిగిందల్లా నిష్కల్మషమైన సంకల్పంతో ప్రయత్నించడం, ఆయన అనుగ్రహం కోసం నిరీక్షించడం మాత్రమే!
ఈ కార్యంలో తమ సమయాన్ని, సంపదను, శ్రమను సమర్పించిన ప్రతి ఒక్కరూ ఆ సదాశివుడి అనుగ్రహానికి పాత్రులే.
ఇప్పుడు సాధన కుటీర్‌లో సదాశివుడి సన్నిధి మరింత శక్తిమంతమైంది. ఆ శక్తికి తగినట్టుగానే కుటీర్ బాధ్యత కూడా మరింత పెరిగింది.
ఇకపై ఈ శక్తి వ్యక్తిగత ఆరాధనకే పరిమితం కాకుండా, సమాజహితానికి, ధర్మ పరిరక్షణకు, భావితరాల ఉన్నతికి మరింతగా ఉపయోగపడాలి.
ఎందుకంటే...
శివుడు కొలువుదీరిన చోటు కేవలం ఆలయం కాదు... శివ సంకల్పంతో సమాజానికి మేలు జరిగే చోటే నిజమైన క్షేత్రం!
ఓం నమః శివాయ!
సర్వం శివార్పణమస్తు!
No comments:
Post a Comment