Monday, August 3, 2026

కబంద వృక్ష ప్రతిష్ట

శ్రీ కదంబ వృక్ష ప్రతిష్ఠా యజ్ఞం
"వృక్షో రక్షతి రక్షితః" – వృక్షాన్ని రక్షించినవారిని వృక్షమే రక్షిస్తుంది.
అత్యంత శ్రమతో అడవి ప్రాంతాల నుండి సేకరించిన పవిత్ర శ్రీ కదంబ మొక్కలకు, పవిత్ర గోదావరి తీరాన వెలసిన బాసర 
శ్రీ జ్ఞానసరస్వతి దేవి సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, అనంతరం వాటిని జ్ఞాన సరస్వతి సాధన కుటీర్‌కు అందిచబడ్డాయి. సామాజిక కార్యకర్త శ్రీ వనం కిరణ్ గారిచే సేకరించబడి  మొక్కలను శ్రీ విశ్వామిత్ర గారి ద్వారా సాధన కుటీర్‌కు అందించబడ్డాయి.
సాధన కుటీర్ లో వెలసిన  పరమేశ్వరుని సాక్షిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి,  సాధన కుటీర్ ప్రాంగణంలోని దేవతా వృక్షాల బిషనోయ్  వనంలో  కొన్ని మొక్కలను అలాగే అన్నపూర్ణ మండపం మరియు భారతమాత సన్నిధిలో  శ్రీ కదంబ వృక్షాలను నాటడం జరిగింది.
మహా మహిమాన్వితమైన శ్రీ కదంబ వృక్షము సాక్షాత్తు జగజ్జనని ఆదిశక్తి స్వరూపముగా భారతీయ సనాతన సంప్రదాయంలో అనాదికాలం నుండి ఆరాధించబడుతోంది. ఈ పవిత్ర వృక్షము ప్రకృతిలో సమతుల్యతను కాపాడుతూ, మానవాళికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, విద్యా వికాసం, సంస్కార విలువలు ప్రసాదించునని విశ్వాసం.
కలియుగంలో ధర్మస్థాపన, దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి పరిరక్షణ, లోకక్షేమం అనే మహత్తర సంకల్పంతో ఈ "శ్రీ కదంబ వృక్ష ప్రతిష్ఠా యజ్ఞం" ప్రారంభించబడుతోంది.
పవిత్ర గోదావరి తీరాన వెలసిన బాసరలో, శ్రీ వేదవ్యాస మహర్షి తపోబలంతో ప్రతిష్ఠించబడిన శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు లోకక్షేమార్థం కొలువై ఉన్నారు*. 
*ఆ దివ్యక్షేత్రంలో ఆశీర్వదించబడిన ఈ పవిత్ర కదంబ వృక్షాలను దేశవ్యాప్తంగా నదీతీరాలు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, గోశాలలు, విద్యాలయాలు, సేవా కేంద్రాలు వంటి పవిత్ర ప్రదేశాలలో ప్రతిష్ఠిస్తూ ప్రకృతి పరిరక్షణ – ధర్మ పరిరక్షణ – లోక కళ్యాణం అనే మహోన్నత లక్ష్యంతో ఈ యజ్ఞాన్ని విస్తరింపజేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

ప్రతి కదంబ వృక్షం ఒక దేవాలయంగా...
నాటిన ప్రతీ మొక్క ఒక యజ్ఞంగా...
  ప్రతి సంరక్షకుడు ఒక ఋషిగా...
ప్రతి ప్రాంతం ధర్మక్షేత్రంగా వికసించుగాక!
లోకాః సమస్తాః సుఖినో భవంతు। సమస్త సన్మంగళాని భవంతు.
:~ సదా వెంకట్, GSF.

No comments:

Post a Comment