Friday, July 24, 2026

పద్యాల తోరణం : దోరవేటి

*సంకల్ప బలమే విజయసాధనకు తొలిమెట్టు*.---- దోరవేటి
+++++++++++++++++++++++
ప్రభుత్వ పాఠశాల్లో చదివే పిల్లల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట రెడ్డి గారు ఈ సదాశయంతో తన సమస్తాన్ని వర్ధమాన సమాజానికి అంకితం చేస్తూ  అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా తెలుగు పద్యాలను ఈ తరం విద్యార్థులకు కంఠస్థం చేయించాలని దానివల్ల తెలుగు భాష మాధుర్యం, తెలుగు భాష ఉన్నతి, విస్తృతి సక్రమంగా జరుగుతాయని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పద్యాల తోరణం కార్యక్రమం నిర్వహించేందుకు  మాతో కలిసి చర్చించడం జరిగింది. ఈ ఆశయ సాధనకు తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ విషయం మీద చర్చించడం కూడా అయింది. ఇదే సందర్భంలో ఇటీవలి కాలంలో భవాని జగదీశ్వర్ రెడ్డి ద్వారా ఒక విషయం తెలిసింది. 
    తమ్ముడు కందాడ రంగరాజు తన విద్యార్థుల కోసం శతకాల నుండి భారత భాగవతాది గ్రంథాల నుండి ఆణిముత్యాలు వంటి పద్యాలను సేకరించి పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు కోసం ఒక పుస్తకాన్ని రూపొందించినారని అది ప్రజాల తోరణం నిర్వహణకు బాగా ఉపకరిస్తుందని ఈ విషయంలో తనతో మాట్లాడాలని కూడా చెప్పినారు. 
    సదా వెంకటరెడ్డి ఆశయం, కండాడై రంగరాజు ఆలోచన రెండూ ఒకటైతే పద్యాల తోరణం కార్యక్రమం నిర్వహణ తేలికవుతుందని అనిపించి ఈ పుస్తకాన్ని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా ప్రకటించాలని కోరడం జరిగింది. అందుకు వెంకట రెడ్డి గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పకుండా మేమే దాన్ని ప్రచురిస్తామని ప్రకటించారు. ఆ విధంగా సుమారు 200 పై చిలుకు పద్యాలు ఉన్న ఈ గ్రంథం మీ చేతుల్లోకి వచ్చింది.
     తొలి ప్రయత్నం గా పిల్లలకు కొన్ని పద్యాలు మాత్రం నేర్చుకొని, పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. దీని తర్వాత దశలో పద్యాల సంఖ్య పెంచడం;  పద్యాల అంత్యాక్షరి కార్యక్రమం చేపట్టడం;  సామూహికంగా పద్య సాధన చేయించడం; సామూహిక పద్యాల పోటీ నిర్వహించడం... ఈ తెలుగు పద్యాల ధారణ, విస్తృతి లో భాగంగా మాకు ఉన్న యోజన తప్పకుండా కార్యరూపం దాల్చి అనుకున్న ఫలితాలను సాధిస్తుందని, వెంకటరెడ్డి గారు కోరుకున్నట్లు జిల్లా అంతట పద్య పరిమళం వ్యాపించడమే కాకుండా ఇతర జిల్లాలకు ఇది స్ఫూర్తిగా నిలబడగలదని నా ప్రగాఢ విశ్వాసం. ఇందుకోసం తెలుగు పండితులు, పండిత పరిషత్తు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మిత్రులు, విశేషించి మండల , జిల్లా విద్యాధికారులు ఎంతో సహృదయంతో సహకరిస్తుండటం మా ఆశయ సాఫల్యానికి ఊతమిస్తున్నది. అందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, వారి కృషికి, సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తక ప్రయోజనం కేవలం పిల్లలకు పరిమితం కాకుండా, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా దీని ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తున్నాం.
     మున్ముందు తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు,  పెద్దవాళ్లకు కూడా ఈ పోటీల్లో అవకాశం కల్పించాలని , పద్యాల అంత్యాక్షరి, పద్యపఠన వైవిధ్యం, అష్టావధాన, శతావధాన కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ విషయంలో పెద్దలు, విజ్ఞులు పద్యాభిమానులు, తెలుగు పండితులు అవసరమైన సూచనలు చేస్తే వాటిని మున్ముందు యోజనలో, పుస్తకం పునర్ ముద్రణలో అవకాశం ఉన్న మేర సవరణలు చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం.
     *ఈ విషయంలో సహకరించడానికి మా అనంత సాహిత్య సంస్కృతిక వేదిక ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారని ప్రకటించడానికి గర్విస్తున్నాను.* 
    పద్యాభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు !

No comments:

Post a Comment